cricket: టీ20ల్లో టీమిండియా ఓపెనింగ్ జోడిపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఓపెనింగ్ భాగస్వామ్యం టీమిండియాకి ‘మంచి సమస్య’గా అభివర్ణించిన మాజీ దిగ్గజం
- శుభ్‌మాన్ గిల్, గైక్వాడ్, జైస్వాల్‌తోపాటు రోహిత్ శర్మ కూడా వేచివున్నాడని వ్యాఖ్య
- ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు
రోహిత్ శర్మ విశ్రాంతి కోరుకోవడం, గాయం కారణంగా ఆల్-రౌండర్ హార్ధిక్ పాండ్యా దూరమవ్వడంతో ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో సూర్య స్థానంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలంటూ రోహిత్ శర్మను బీసీసీఐ కోరగా విరామం కావాలని చెప్పాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం టీ20 మ్యాచ్‌ల్లో ఆడకపోయినా టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడడం ఖాయమంటూ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 జట్టుపై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొదటి టీ20 మ్యాచ్‌కి ముందు టీమిండియా ఓపెనింగ్ కాంబినేషన్‌పై ప్రశ్నించగా ఆసక్తికరంగా స్పందించాడు. ఈ సిరీస్ విషయానికి వస్తే శుభమాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్‌తోపాటు యశస్వి జైస్వాల్ కూడా రేసులో ఉన్నాడు. జైస్వాల్ కూడా బాగానే రాణించాడు. జట్టుకు ఎడమ చేతి, కుడిచేతి కాంబినేషన్ అవసరమని భావిస్తే శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్ ఉత్తమ జోడీ అని గవాస్కర్ అన్నాడు. ఓపెనింగ్ కాంబినేషన్ టీమిండియాకు చాలా మంచి సమస్య అని వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ కూడా వేచి ఉన్నాడని, టీ20 వరల్డ్ కప్‌కు అందుబాటులో ఉంటాడో లేదో వేచిచూడాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడాడు.
ఇదిలావుండగా వచ్చే ఏడాది జరగనున్న టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌కు టీమిండియా కొన్ని ముఖ్యమైన టీ20 సిరీస్‌లు ఆడనుంది. అందులో దక్షిణాఫ్రికా టూర్ కూడా ఒకటిగా ఉంది. ఈ సిరీస్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను సెలక్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ముఖ్యంగా రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లను బీసీసీఐ సెలక్టర్లు పరిశీలించనున్నారు.