Deep fake video: డీప్‌ఫేక్ బెడదకు వీటితో కళ్లెం!
- డీప్ ఫేక్ వీడియోల సమస్యకు చెక్ పెడుతున్న స్వచ్ఛంద సంస్థలు
- ఆన్‌లైన్‌లోని బాధితుల డీప్‌ఫేక్ వీడియోలు ఫొటోలు తొలగిస్తున్న stopncii.org
- సంస్థ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసిన వారి డీప్‌ఫేక్ వీడియోల తొలగింపు
- తమకూ ఫిర్యాదు చేస్తే నెట్టింట వీడియోలు తొలగిస్తామంటున్న పోలీసులు
సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడాల్లేకుండా డీఫ్ ఫేక్ వీడియోల బారిన పడుతుండటంతో పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇలాంటి సమయాల్లో కుంగిపోకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ వీడియోలు, ఫొటోలను తొలగించడంతో పాటూ నిందితులపై చర్యలు తీసుకుంటామని కూడా చెబుతున్నారు. డీప్‌ఫేక్ వీడియోలను తొలగించేందుకు పోలీసులతో పాటూ కొన్ని స్వచ్చంధ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన సంస్థ stopncii.orgలో డీప్ ఫేక్ బాధితులు ఫిర్యాదు చేస్తే వీడియోలను అంతర్జాలంలో కనబడకుండా చేస్తామని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.
ఫిర్యాదు విధానం ఇలా..
- ఆన్‌లైన్‌లో తమ డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయని గుర్తించిన బాధితులు stopncii.org వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి. తమ సమస్యకు అనుగుణంగా వెబ్‌సైట్‌లో ఆప్షన్ ఎంచుకోవాలి.
- మైనర్లల కోసం వెబ్‌సైట్లో రెండు ఇతర లింకులు అందుబాటులో ఉన్నాయి.
- తొలుత, డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలు ఎంపిక చేసుకుని సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
- వీడియోలు, ఫొటోల్లో కనిపిస్తున్న వారి వయసు, వ్యక్తులు, వాటి నేపథ్యం (సమయం, ప్రాంతం, దుస్తులు ధరించారా? లేదా? తదితర విషయాలు) వివరించాలి.
- ఈ క్రమంలో కేసు నమోదు చేసి బాధితులకు ఓ ఆరు అంకెల రహస్య కోడ్ జారీ చేస్తారు. ఈ సంఖ్య ఆధారంగా కేసు పురోగతి తెలుసుకోవచ్చు. ఫిర్యాదులోని వివరాలు గోప్యంగా ఉంచుతారు.