Sabaraimala Temple: శబరిమల ఆలయం వద్ద క్యూ లైన్‌లో కుప్పకూలిన బాలిక.. చికిత్స పొందుతూ మృతి

girl collapses and dies while waiting in queue at Sabrimala temple
  • గుండె సంబంధిత సమస్యతో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
  • సుదీర్ఘ సమయంపాటు క్యూలైన్‌లో వేచివున్న బాలిక
  • ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలింపు  
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. దర్శనం కోసం క్యూలైన్‌లో వేచివున్న 11 ఏళ్ల బాలిక చనిపోయింది. గుండె సంబంధిత సమస్యతో బాలిక మృతి చెందింది. సుదీర్ఘ సమయం క్యూలైన్‌లో వేచి ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక గత మూడేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందని తెలిసింది. 

 ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి ప్రస్తుతం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. దర్శనానికి కొందరు భక్తులు 18 గంటలపాటు వేచిచూడాల్సి వస్తోంది. ఎక్కువ సమయం నిరీక్షించలేక చాలా మంది యాత్రికులు క్యూ వ్యవస్థను అతిక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. బారికేడ్‌లను దూకేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా పవిత్ర మెట్ల దగ్గర అనియంత్రిత రద్దీ పెరుగుతోంది. ఈ పరిస్థితులే అక్కడ గందరగోళానికి కారణమవుతున్నాయి. 

మరోవైపు.. విపరీతంగా రద్దీ పెరుగుదలపై కేరళ మంత్రి రాధాకృష్ణన్, ట్రావెన్‌కోర్ బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని 10,000కు తగ్గించారు. అంతేకాకుండా రోజువారీ గరిష్ఠ భక్తుల సంఖ్య పరిమితిని 90 వేల నుంచి 80 వేలకు తగ్గించారు.

భద్రతా చర్యలను పటిష్ఠం చేయడంలో భాగంగా సన్నిధానం వద్ద ప్రత్యేక రెస్క్యూ అంబులెన్స్ సేవను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణమే వైద్య సేవలు అందజేయనున్నట్టు వెల్లడించారు.
Sabaraimala Temple
Kerala
Girl
Ayyappa Swamy

More Telugu News