Amaravati: ఏపీ రాజధాని తరలింపుపై పిటిషన్... హైకోర్టు ఏమన్నదంటే...!

High Court takes up hearing on capital relocation

  • క్యాంపు కార్యాలయాల ఏర్పాటు ముసుగులో రాజధాని తరలిస్తున్నారంటూ పిటిషన్
  • త్రిసభ్య ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే  తానే విచారిస్తానన్న జడ్జి
  • అంగీకారం తెలిపిన ప్రభుత్వం తరఫు న్యాయవాది
  • మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్
  • విచారణ రేపటికి వాయిదా

క్యాంపు కార్యాలయాల ఏర్పాటు ముసుగులో విశాఖకు రాజధానిని తరలిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ రోస్టర్ ప్రకారం తన బెంచ్ ఎదుటకు వచ్చిందని జడ్జి పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను తాను విచారించి ఆదేశాలు ఇవ్వొచ్చని తెలిపారు. 

అయితే, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, దీనిపై వారు మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసుకోవచ్చని సూచించారు. రాజధాని వ్యవహారాలను విచారించే త్రిసభ్య ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే తానే విచారిస్తానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

కాగా, ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం తరఫు న్యాయవాది అంగీకారం తెలిపారు. ఈ లోపు ప్రభుత్వం కార్యాలయాలను తరలించేందుకు ప్రయత్నిస్తుందని, మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ కోరారు. కార్యాలయాల తరలింపు ఇప్పటికిప్పుడు ఏమీ జరగదని, అది సుదీర్ఘ ప్రక్రియ అని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇలానే చెప్పి కార్యాలయాలు తరలించేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు చేస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో, హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.... కార్యాలయాల తరలింపు ఉండదని ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన ఆదేశాలు తీసుకోవాలని అడ్వొకేట్ జనరల్ కు సూచించింది. అనంతరం కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News