Nara Lokesh: నాదెండ్ల మనోహర్ అరెస్టుపై స్పందించిన నారా లోకేశ్
- ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాదెండ్ల అరెస్టును ఖండించిన లోకేశ్
- నియంత పాలనకు చరమగీతం పాడుదామని ప్రజలకు పిలుపు
- ఈ మేరకు వైఏపీహేట్స్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నేతల అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాదెండ్ల మనోహర్, జనసేన నేతల అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేసిన నియంత పాలనకు చరమగీతం పాడుదామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు WhyAPHatesJagan అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.
అంతకుముందు యువగళం పాదయాత్రలో భాగంగా తునిలో నిర్వహించిన సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ జోడీ బ్లాక్ బస్టర్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అవినీతికి పాల్పడిన ఉద్యోగులను డిస్మిస్ చేస్తామని, వీరు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక కార్పోరేషన్ ద్వారా కాపులను పేదరికం నుంచి బయటపడేస్తామన్నారు. కాపు రిజ్వేషన్ కోసం మంత్రి రాజాను నిలదీయాలని, బీసీలకు ఇబ్బంది లేకుండా వీరికి రిజర్వేషన్ కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు.