Revanth Reddy: రైతులకు పెట్టుబడి సాయం... నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- కేసీఆర్ హయాంలో ప్రారంభమైన రైతుబంధు
- విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో గతంలోని విధానాల ప్రకారమే పెట్టుబడి సాయం
- ఎన్నికలకు ముందు రూ.15000 ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ రైతులకు పంట పెట్టుబడి సాయం 'రైతుబంధు' చెల్లింపులను కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ట్రెజరీ నిధుల విడుదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు పేరుతో పంట పెట్టుబడి సాయాన్ని అందించారు. అయితే కొత్త ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా విధివిధానాలను ఖరారు చేయలేదు. దీంతో ప్రస్తుతానికి గతంలోని విధివిధానాల ప్రకారమే పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సాయం కింద ప్రతి ఆరు నెలలకు ఎకరానికి రూ.5000 అందిస్తారు. ఏడాదిలో రెండు పర్యాయాలు... మొత్తం రూ.10,000 అందిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక ఎకరాకు ఏడాదికి రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ పెట్టారు. అయితే ఇంకా విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో ఈసారికి గత విధివిధానాల ప్రకారం ఇవ్వనున్నారు.