Kaushal Kishore: విశాఖ మెట్రో రుణంపై ఏపీ ప్రతిపాదనలు పంపలేదు: కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్
- వైజాగ్ మెట్రోకు నిధులిచ్చేందుకు గతంలో కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు నిస్సహాయత
- ఇతర బ్యాంకు రుణాలపై ఏపీ ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్ర మంత్రి
- రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి
వైజాగ్ మెట్రో ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు నిస్సహాయత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, మరేదైనా సంస్థ నుంచి ప్రాజెక్టు రుణం ఇప్పించాలని ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. రాజ్యసభలో సోమవారం టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.
పట్టణ రవాణా వ్యవస్థకు సంబంధించి ప్రణాళిక, నిర్వహణ, నిధుల సమీకరణ, పర్యవేక్షణ, అమలు బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలదే అని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు విమానాశ్రయం నుంచి బెంగళూరు, వైజాగ్, చెన్నైకి విమానాలు నడపడానికి ఇండిగో ఎయిర్లైన్స్ షెడ్యూల్ సమర్పించినట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధాన పథకం కింద ఈ ఎయిర్పోర్టును రూ.241 కోట్లతో అభివృద్ధి చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.