Sudhir Reddy: పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందన
- బీఆర్ఎస్ ను వీడుతున్నాననే వార్తల్లో నిజం లేదన్న సుధీర్ రెడ్డి
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారబోరని వ్యాఖ్య
- కేసీఆర్ ను రేవంత్ పరామర్శించడాన్ని స్వాగతించిన ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డి స్పందిస్తూ... ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. ప్రజాసేవ చేయడానికి పార్టీ మారాల్సిన అవసరం లేదని అన్నారు. తొందరపడి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారరని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల వైపు ఉండాలనే భావజాలంతో తాము పని చేస్తామని సుధీర్ రెడ్డి అన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నాలుగైదు నెలల సమయం ఇస్తామని... ఈలోగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. తమ అధినేత కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. కేసీఆర్ ను రేవంత్ పరామర్శించడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారని విమర్శించారు.