Bhajalal Sharma: రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్ లాల్ శర్మ... అదృష్టం అంటే ఆయనదే!
- రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు
- నేడు సీఎం పేరును ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం
- భజన్ లాల్ శర్మ పేరును ప్రతిపాదించిన వసుంధరా రాజే
- ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సీఎం పీఠం ఎక్కుతున్న భజన్ లాల్ శర్మ
ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విజయభేరి మోగించింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు సీఎంలను ప్రకటిస్తోంది. మధ్యప్రదేశ్ కు మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన బీజేపీ హైకమాండ్... నేడు రాజస్థాన్ సీఎం పేరును ప్రకటించింది.
భజన్ లాల్ శర్మను రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా నియమించింది. దియా సింగ్, డాక్టర్ ప్రేమ్ చంద్ భైర్వాలను డిప్యూటీ సీఎంలుగా నియమించింది. వాసుదేవ్ దేవ్ నాని స్పీకర్ గా వ్యవహరిస్తారని బీజేపీ ఓ ప్రకటన చేసింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... సీఎం పీఠం ఎక్కుతున్న భజన్ లాల్ శర్మ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హేమాహేమీలను కాదని మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న భజన్ లాల్ శర్మను బీజేపీ అధిష్ఠానం నూతన ముఖ్యమంత్రిగా పేర్కొనడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, శాసనసభా పక్ష సమావేశంలో భజన్ లాల్ శర్మ పేరును మాజీ సీఎం వసుంధరా రాజే ప్రతిపాదించారు. మిగతా బీజేపీ సభ్యులు ఆమె నిర్ణయాన్ని బలపరిచారు.
తాజా పరిణామాలపై రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి స్పందించారు. భజన్ లాల్ శర్మ చాలాకాలంగా పార్టీ కోసం తెర వెనుక కృషి చేస్తున్నారని చెప్పారు. రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ నియామకం సంతోషదాయకమని పేర్కొన్నారు.