Revanth Reddy: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ... తదుపరి పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి
- సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఉన్నతాధికారులు
- ప్రస్తుత స్థితి, పరీక్షల నిర్వహణ, తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేసు వివరాలు, పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఉన్నతాధికారులు, కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ పాల్గొన్నారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు, చైర్మన్ సహా సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. కమిషన్ ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలు, మిగిలిన నియామకాల ప్రస్తుత స్థితి, పరీక్షల నిర్వహణ, తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గ్రూప్ 1, ఏఈఈ తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో పురోగతి, ఇప్పటి వరకు జరిగిన విచారణ, తదుపరి కార్యాచరణపై చర్చించారు. అదే సమయంలో ఇతర పరీక్షల తేదీలు, నిర్వహణ అంశంపై చర్చించారు. లీకేజీతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారని, కాబట్టి అన్ని అంశాలను పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.