Gaddam Prasad: వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన గడ్డం ప్రసాద్ చదివింది ఇంటరే!
- టీఎస్ అసెంబ్లీ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ నామినేషన్
- ప్రసాద్ నామినేషన్ కు బీఆర్ఎస్ మద్దతు
- వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రసాద్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ నామినేషన్ వేశారు. స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతును ప్రకటించింది. దీంతో, ఆయన ఎన్నిక లాంఛనమే. మరోవైపు గడ్డం ప్రసాద్ ఎవరనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... తెలంగాణ స్పీకర్ గా ఎన్నికవుతున్న తొలి దళిత వ్యక్తి గడ్డం ప్రసాద్. కేవలం ఇంటర్ వరకు మాత్రమే చదివిన ప్రసాద్ కు రాజకీయంగా పెద్ద ట్రాక్ రికార్డ్ ఉంది.
రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించిన ప్రసాద్... 2008 ఉపఎన్నికలో వికారాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2012లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన వరుసగా ఓటమిపాలయ్యారు. అయితే 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన వికారాబాద్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు స్పీకర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు.