Revanth Reddy: పార్లమెంట్ నమూనాలో తెలంగాణ అసెంబ్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- శాసన సభ, శాసన మండలి ఒకేచోట ఉంటాయని వెల్లడి
- శాసన సభ, మండలి మినహా మరే ఇతర భవనాలు అసెంబ్లీ ప్రాంగణంలో ఉండవన్న రేవంత్ రెడ్డి
- రైల్వే గేట్‌కు ఆనుకొని ఉన్న ప్రహరీ గోడ ఎత్తు పెంచాలన్న ముఖ్యమంత్రి
తెలంగాణ అసెంబ్లీ... పార్లమెంట్ నమూనాలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అన్నారు. ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన నడుస్తూ మొత్తం పరిశీలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి కేటీఆర్, అధికారులు తదితరులతో కలిసి అసెంబ్లీ ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... శాసన సభ, శాసన మండలి ఒకేచోట ఉండేలా చూస్తామన్నారు. శాసనసభ, మండలి మినహా మరే ఇతర భవనాలు అసెంబ్లీ ప్రాంగణంలో ఉండవని స్పష్టం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న చెట్లను తొలగించకుండా మరింత గ్రీనరీని పెంచవలసి ఉందన్నారు. అసెంబ్లీకి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రైల్వే గేట్‌కు ఆనుకొని ఉన్న ప్రహరీ గోడ ఎత్తు పెంచవలసి ఉందన్నారు. సభ్యులు ఉదయం పూట వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు.
ఢిల్లీలో తెలంగాణ భవన్
తెలంగాణ బ్రాండ్ వుండేలా మండలి భవనాన్ని, ఢిల్లీలో తెలంగాణ భవన్ ని నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం పబ్లిక్ గార్డెన్స్‌లోని జూబ్లీహాల్ ప్రాంగణంలో కొనసాగుతున్న శాసన మండలికి అదే ప్రాంగణంలో కొత్త భవనాన్ని నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఢిల్లీలో ఏపీ భవన్లో ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని అశోక రోడ్డులో రెండు భాగాలుగా 19 ఎకరాల విస్తీర్ణం ఏపీ భవన్ పరిధిలో ఉంది. పన్నెండు ఎకరాల్లో భవనాలు ఉన్నాయి. ఇందులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వేర్వేరుగా బోర్డులు ఏర్పాటు చేసుకున్నాయి. ఖాళీగా ఉన్న ఏడు ఎకరాల్లో తెలంగాణ భవన్‌ను నిర్మించాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం... అధికారులకు ప్రతిపాదనలు పంపించింది.
ఇక శాసన సభ, మండలిలకు కొత్త భవనాలు నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎర్రమంజిల్ నీటిపారుదల, రహదారుల భవన ప్రాంగణంలో నిర్మించేందుకు కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇది హెరిటేజ్ జాబితాలో ఉండటంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో జూబ్లీహాల్ ప్రాంగణంలో శాసన మండలికి కొత్త భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 2006 నుంచి ఇక్కడే మండలి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ భవనం నిర్మించాలంటే అనుమతులు, అడ్డంకులు తొలగించడం అవసరం. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.