Harish Rao: పార్లమెంట్‌ కలకలంపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao responds on Parliament issue

  • పార్లమెంటుకు రక్షణ లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్య
  • పార్లమెంట్‌కే రక్షణ కల్పించని కేంద్రం ప్రజలను ఎలా రక్షిస్తుంది? అని ప్రశ్న
  • ఈ ఘటనపై విచారణ జరిపి భద్రత కట్టుదిట్టం చేయాలని సూచన

పార్లమెంట్‌లో బుధవారం చోటు చేసుకున్న ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. పార్లమెంటుకు రక్షణ లేకపోవడం దురదృష్టకరమన్నారు. బుధవారం నర్సాపూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞతా సభలో ఆయన మాట్లాడుతూ... లోక్ స‌భ‌లో బుధ‌వారం జీరో అవ‌ర్ జ‌రుగుతుండ‌గా విజిట‌ర్స్ గ్యాల‌రీ నుంచి ఆగంతు‌కులు కింద‌కు దూకి గ్యాస్‌ను వ‌ద‌లడంపై హరీశ్ రావు స్పందించారు. పార్లమెంట్‌కే రక్షణ కల్పించని కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఎలా రక్షిస్తుంది? అని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి భద్రత కట్టుదిట్టం చేయాలని సూచించారు. 

హరీశ్ రావు ఇంకా మాట్లాడుతూ... నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని గెలిపించినందుకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానన్నారు. గెలవకపోవడం కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, అంతిమంగా గమ్యం చేరేది బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని, ఫోన్ చేస్తే గంటలో మీ ముందుంటానని హామీనిచ్చారు. తమ ప్రభుత్వం హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు. అధికార పార్టీ నాయకులు మానసికంగా ఇబ్బంది పెడతారని కార్యకర్తలను హెచ్చరించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దన్నారు. ఎవరేమిటో మున్ముందు ప్రజలే గ్రహిస్తారని, కేసీఆర్‌కు పనితనం తప్ప పగతనం తెలియదన్నారు.

  • Loading...

More Telugu News