Ponnam Prabhakar: ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు: మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
- ప్రభుత్వం కూలుతుందని కడియం అంటున్నారని ఆగ్రహం
- కేసీఆర్, కేటీఆర్‌లు కడియం శ్రీహరి వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్న
- కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలు ఇంకా ఎన్ని బయటపడతాయోనని వ్యాఖ్య
ఎవరైనా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని.. అలాగే తాను మంత్రిని అయినప్పటికీ కరీంనగర్ బిడ్డనేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రిగా తొలిసారి కరీంనగర్ వచ్చిన పొన్నంకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అల్గునూర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన సాధారణ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చేసిందని.. మంత్రిగా చేసిందని భావోద్వేగానికి గురయ్యారు. చొక్కారావు శిష్యుడిని మంత్రిగా చేసింది కరీంనగర్ ప్రజలే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టిందని, నియంతృత్వాన్ని బద్దలు కొట్టిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ దెబ్బకు ఇప్పుడు ప్రగతి భవన్ బద్దలైందన్నారు.
ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అనారోగ్యంతో ఉంటే కాంగ్రెస్ పరామర్శించిందని, కానీ బీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం వ్యాఖ్యలను కేసీఆర్, కేటీఆర్‌లు ఎందుకు ఖండించడం లేదో చెప్పాలన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అగాధమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలు ఇంకా ఎన్ని బయటపడతాయో అన్నారు. అక్రమాలు, అప్పులు చేసిన కేసీఆర్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చేతగాని దద్దమ్మలు పార్టీలు మారి తమపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. తన ముప్పై ఆరేళ్ళ రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో వారికి మరింత సేవ చేసే బలం వచ్చిందన్నారు.