BJP: తెలంగాణలో లోక్ సభలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు...? టైమ్స్ నౌ సర్వే
- తెలంగాణలో కాంగ్రెస్కు 8-10, బీఆర్ఎస్ పార్టీకి 3-5 సీట్లు, బీజేపీకి 3-5 సీట్లు రావొచ్చునని వెల్లడించిన సర్వే
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కు 37 శాతం, బీఆర్ఎస్కు 32 శాతం, బీజేపీకి 24 శాతం ఓట్లు
- గత ఎన్నికల్లో కంటే భారీగా పుంజుకోనున్న కాంగ్రెస్
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మరో నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే నిర్వహించింది. జాతీయస్థాయిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావొచ్చు? తెలంగాణలో ఏ పార్టీ అధిక సీట్లు గెలుచుకుంటుంది? అని సర్వే నిర్వహించారు. గత ఎన్నికల్లో మూడు సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు గెలుచుకోవచ్చునని తాజా సర్వే వెల్లడించింది. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ప్లస్ కానుంది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లకు గాను 8-10 సీట్లు రావొచ్చునని, నిన్నటి వరకు అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి 3-5 సీట్లు, బీజేపీకి 3-5 సీట్లు రావొచ్చునని వెల్లడించింది.
ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు వస్తే తెలంగాణలో కాంగ్రెస్కు 37 శాతం, బీఆర్ఎస్కు 32 శాతం, బీజేపీకి 24 శాతం ఓట్లు వస్తాయని, ఎంఐఎం సహా ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.
2019లో కాంగ్రెస్ 3, బీజేపీ 4, బీఆర్ఎస్ 9, మజ్లిస్ స్థానంలో విజయం సాధించాయి. గత ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ సీట్లు సగానికి పడిపోనున్నాయని, కాంగ్రెస్ స్థానాలు రెండింతలు లేదా మూడింతలు పెరగవచ్చునని, బీజేపీ స్థానాలు దాదాపు అదే విధంగా ఉండవచ్చునని ఈ సర్వే పేర్కొంది.