Suryakumar Yadav: సూర్య సూపర్ సెంచరీ... జొహాన్నెస్ బర్గ్ లో సిక్సర్ల వాన
- చివరి టీ20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
- జొహాన్నెస్ బర్గ్ లో మ్యాచ్
- నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసిన టీమిండియా
- 56 బంతుల్లోనే 100 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్
- 7 ఫోర్లు, 8 సిక్సులు బాదిన 'మిస్టర్ 360'
దక్షిణాఫ్రికాతో సిరీస్ సమం చేయాలంటే తప్పక నెగ్గి తీరాల్సిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత సెంచరీ నమోదు చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా సూర్య సెంచరీ సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.
సూర్యకుమార్ యాదవ్ కేవలం 56 బంతుల్లోనే 100 పరుగులు చేయడం విశేషం. సూర్య స్కోరులో ఫోర్ల కంటే సిక్సులే ఎక్కువ ఉన్నాయి. ఈ 'మిస్టర్ 360' బ్యాట్స్ మన్ 7 ఫోర్లు, 8 సిక్సులు బాదాడు. టీమిండియా 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ, యశస్వి జైస్వాల్ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ స్కోరుబోర్డును ఉరకలెత్తించాడు. జైస్వాల్ 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేసి ఓపెనర్ గా తన స్థానానికి న్యాయం చేశాడు.
టీమిండియా ఇన్నింగ్స్ లో వీరిద్దరి ఆటే హైలైట్. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (12), తిలక్ వర్మ (0), రింకూ సింగ్ (14), వికెట్ కీపర్ జితేశ్ శర్మ (4), రవీంద్ర జడేజా (4) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2, లిజాద్ విలియమ్స్ 2, నాండ్రే బర్గర్ 1, తబ్రైజ్ షంసీ 1 వికెట్ తీశారు.