Andhra Pradesh: ఏపీలో 4 జిల్లాల్లో యురేనియం కోసం అన్వేషణ: అణుఇంధన శాఖ మంత్రి
- రాజ్యసభలో గురువారం బల్బీర్ సింగ్ ప్రశ్నకు మంత్రి సమాధానం
- వైయస్ఆర్, అన్నమయ్య, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో అన్వేషణ సాగుతున్నట్టు వెల్లడి
- కన్నంపల్లె, చిత్రియాల్‌లో గనులు, ప్లాంట్ ఏర్పాటు పనులు వివిధ దశల్లో ఉన్నాయన్న మంత్రి
ఏపీలో యురేనియం కోసం అన్వేషణ జరుపుతున్నట్టు కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. గురువారం రాజ్యసభలో సంత్ బల్బీర్‌సింగ్ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. మొత్తం నాలుగు జిల్లాలలో యురేనియం కోసం అన్వేషిస్తున్నట్టు వెల్లడించారు.
వైయస్‌ఆర్ జిల్లాల్లోని నల్లగొండవారిపల్లె, అంబకపల్లె, బక్కన్నగారిపల్లె, శివారంపురం, పించ, కుమరంపల్లె, నాగాయపల్లెలో అన్వేషణ సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో సారంగపల్లె, మదినపాడు, తంగెడ; కర్నూలు జిల్లాలో బొమ్మరాజుపల్లె, వినకహల్‌పాడు, కప్పట్రాళ్ల; అన్నమయ్య జిల్లాలో కాటమయకుంట, వరికుంటపల్లెలు ఉన్నాయని చెప్పారు. ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఇటీవల కాలంలో ఇక్కడ అన్వేషించినట్టు పేర్కొన్నారు. ఏపీలోని కన్నంపల్లె, తెలంగాణలోని చిత్రియాల్ వద్ద కొత్త గనులు, ప్లాంట్‌లు ఏర్పాటు చేసే విషయమై యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన పనులు వివిధ దశల్లో ఉన్నట్టు తెలిపారు.