Article 370: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పుపై పాక్ ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు
- సుప్రీంకోర్టు సమర్థన రాజకీయ ప్రేరేపితమన్న పాక్‌కేర్ టేకర్ ప్రధాని అన్వారుల్ హక్ కకర్
- పాకిస్థాన్‌కు కశ్మీర్ మెడనరం లాంటిదని వ్యాఖ్య
- కశ్మీర్ ప్రజల స్వీయ నిర్ణయాధికారానికి రాజకీయాలకు అతీతంగా పాక్ నాయకత్వం మద్దతిస్తుందన్న ప్రధాని
ఆర్టికల్ 370 రద్దును భారత అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంపై పాకిస్థాన్ కేర్‌టేకర్ ప్రధాని అన్వారుల్ హక్ కకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది ‘రాజకీయ ప్రేరేపితం’ అని వ్యాఖ్యానించారు. కశ్మీర్ ప్రజలకు తమ నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతు కొనసాగుతుందని నొక్కి చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణ 370ని ఆగస్టు 2019లో కేంద్రం రద్దు చేసింది. కేంద్రం నిర్ణయం సబబేనంటూ సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సుప్రకోర్టు తీర్పుపై తాజాగా పాక్ కేర్‌టేకర్ ప్రధాని కకర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు కశ్మీర్ మెడనరం లాంటిదని పేర్కొన్నారు. కశ్మీర్ లేకుండా పాకిస్థాన్ అనే పదం సంపూర్ణం కాదన్నారు. పాకిస్థాన్, కశ్మీర్ ప్రజల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని అసెంబ్లీలో ప్రత్యేక సెషన్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రజల స్వీయ నిర్ణయాధికారానికి రాజకీయాలకు అతీతంగా పాకిస్థానీ నాయకుల మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ విదేశాంగ విధానంలో జమ్మూకశ్మీర్ ముఖ్యమైనదని పేర్కొన్నారు.