Margadarsi: 'మార్గదర్శి' కేసుల విచారణపై కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు
- మార్గదర్శి కేసులు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ పిటిషన్
- నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
- తమ విచారణ ముగిసేంతవరకు తదుపరి విచారణ జరపవద్దని ఏపీ హైకోర్టుకు ఆదేశాలు
ఈనాడు గ్రూప్ నకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసేంతవరకు మార్గదర్శి కేసులపై తదుపరి విచారణ చేపట్టవద్దని ఏపీ హైకోర్టుకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది.
మార్గదర్శి కేసులను తెలంగాణ హైకోర్టుకు బదలాయించాలన్న ట్రాన్స్ ఫర్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మార్గదర్శి తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
కొన్ని కేసులు తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే, మరి కొన్ని కేసులు నమోదు చేసి ఏపీ హైకోర్టులో విచారణ జరుపుతున్నారని లూథ్రా సుప్రీం ధర్మాసనానికి వివరించారు. కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ జరిగిందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని కేసులు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగేలా చూడాలని విన్నవించారు.
లూథ్రా వాదనలతో జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా బెంచ్ ఏకీభవించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2 లోపు కౌంటరు దాఖలు చేయాలంటూ ఏపీ సర్కారును, సీఐడీని ఆదేశించింది.