Revanth Reddy: పోలీసు నియామకాలు వెంటనే చేపట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి
- డా.బీఆర్ అంబేడ్కర్ సెక్రెటేరియట్లో ప్రభుత్వ నియామకాలపై సీఎం సమీక్ష
- నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలని సూచన
- సెలక్షన్ కమిటీలో లోపాలు, పరిష్కారాలపై నివేదిక కోరిన వైనం
- హోంగార్డు నియామకాలు చేపట్టాలని కూడా ఆదేశం
రాష్ట్రంలో పోలీసు నియామకాలు వెంటనే చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్లో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సెలక్షన్ ప్రక్రియలో ఉన్న లోపాలు, పరిష్కారాలు, రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన రిక్రూట్మెంట్లపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు.
పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరిగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఎనిమిదేళ్లుగా హోంగార్డు నియామకాలు లేవని పేర్కొన్న ముఖ్యమంత్రి, వెంటనే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. హోం గార్డుల సేవలను ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వినియోగించాలని కూడా సూచించారు.