Lokesh: రాష్ట్రంలో కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారు: నారా లోకేశ్

Nara Lokesh Yuvagalam Padayatra In Anakapalli

  • వ్యవసాయ రంగం కుదేలైందని టీడీపీ జాతీయ కార్యదర్శి ఆవేదన
  • అధికారంలోకి రాగానే శారద కాలువ పూడిక తీయిస్తామని రైతులకు హామీ
  • అనకాపల్లిలో లోకేశ్ ను కలిసిన గంగాదేవి పేట రైతులు
  • అంగన్ వాడీలకు అండగా ఉంటామని లోకేశ్ వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ కాలువల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సర్కారు వల్ల రాష్ట్రంలో వ్యవసాయరంగం కుదేలైందని విమర్శించారు. ఈమేరకు అనకాపల్లిలో తనను కలిసిన గంగాదేవి పేట రైతులతో లోకేశ్ మాట్లాడారు. రైతాంగ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా.. టీడీపీ అధికారంలోకి రాగానే అన్నదాతకు అండగా నిలుస్తామని వారికి హామీ ఇచ్చారు. శారద కాలువ పూడిక తీయిస్తామని లోకేశ్ చెప్పారు. 

అనకాపల్లిలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్ మునగపాకలో అంగన్ వాడీలు ఆందోళన శిభిరాన్ని సందర్శించారు. అంగన్ వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవని, వారికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. న్యాయమైన డిమాండ్లను తీర్చాల్సిందిపోయి అంగన్ వాడీలను జగన్ బెదిరింపులకు గురిచేస్తున్నాడని విమర్శించారు. ఇది ఆయన నియంతృత్వ పోకడకు నిదర్శనమని ఆరోపించారు. అంగన్ వాడీ కేంద్రాలను వాలంటీర్లతో నడిపిస్తామన్న మంత్రుల వ్యాఖ్యలపై లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్ వాడీల న్యాయమైన కోరికలను తీరుస్తామని లోకేశ్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News