Revanth Reddy: లేదు... లేదు.. అధ్యక్షా... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు పంపొద్దు.. ఎందుకంటే: రేవంత్ రెడ్డి కొత్త వైఖరి!
- రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- తాను చెప్పేది వినాల్సిందే అన్న రేవంత్ రెడ్డి
- దయచేసి ఎవరినీ బయటకు పంపవద్దని సభాపతికి విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదేపదే అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నినాదాలు చేస్తుండగా సభాపతి ప్రసాద్ కుమార్... కౌశిక్ గారు మీరు సభకు కొత్త.. కాబట్టి ఇలా చేయడం సరికాదని తెలుసుకోండి అని సూచించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేపనిగా నినాదాలు చేశారు. దీంతో ఓ సభ్యుడు సస్పెండ్ చేయాలని సూచించారు. ఈ సూచనపై రేవంత్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు.
అధ్యక్షా.. వారిని బయటకు పంపించవద్దు.. ('సస్పెండ్ చేద్దామంటే) లేనే లేదు.. లేదు లేదు.. వారు వినాల్సిందే (మనం చెబుతుంటే).. వారికి ఇదే శిక్ష. వాళ్లనెవరినీ బయటకు పంపించవద్దు.. దయచేసి ఎవరినీ బయటకు పంపించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.. అని కోరారు. వాళ్లను ఇక్కడ కూర్చోబెట్టి.. కఠోరమైన నిజాలు వినడం ద్వారా వాళ్లలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. కాబట్టి వారిని పంపించవద్దు అధ్యక్షా... అన్నారు. అందుకే ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదేపదే చెప్పే వారికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమిటో చూపిస్తామన్నారు.