Revanth Reddy: నేను కూడా మిమ్మల్ని సభ నుంచి వెళ్లనీయను: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్

Harish Rao counter to Revanth Reddy

  • రికార్డులు చెక్ చేసుకోవాలని అధికార పార్టీకి హరీశ్ రావు సూచన
  • కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా
  • రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే సీఎంగా భావించుకోవడం లేదని వ్యాఖ్య

అసెంబ్లీలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు... మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్... హరీశ్ రావుకు మైక్ ఇచ్చారు. హరీశ్ రావు మాట్లాడుతూంటే... రేవంత్ రెడ్డి ఆపివేసే ప్రయత్నం చేశారు. మిగతా ప్రతిపక్ష సభ్యులకూ మాట్లాడే అవకాశమివ్వాలన్నారు. హరీశ్ రావును మాట్లాడనీయకుండా ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు.

ప్రతిపక్ష నేతగా వివరణను కేటీఆర్ ప్రారంభించారని, అలా అయితే ఆయన పూర్తి చేయవలసి ఉంటుందని, కానీ హరీశ్ రావు ఎలా మాట్లాడతారని మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

దీనికి స్పందించిన హరీశ్ రావు.. మీరు రికార్డులు వెరిఫై చేసుకోవాలని, గతంలో తాము భట్టి విక్రమార్కకు గంటన్నర సమయం, శ్రీధర్ బాబుకు 10 నిమిషాల సమయం మాట్లాడేందుకు ఇచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి ఎంత సేపు అయినా మాట్లాడనీయండి అంటారని.. కానీ మా గొంతు నొక్కుతున్నారని, మీ మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ చేతలు గడప దాటడం లేదన్నారు. 

ఇప్పుడే మా గొంతు నొక్కితే.. రేపు మాకు న్యాయం చేస్తారంటే ఎలా నమ్మాలన్నారు. వారికి హుందాతనం లేకపోయినప్పటికీ తాము బాధ్యతగానే మాట్లాడుతామని హరీశ్ రావు అన్నారు. 

గంటన్నరలో రేవంత్ తమ పార్టీపై ఇష్టారీతిన విమర్శలు చేశారని, వారికి సమాధానం చెప్పవలసి ఉందన్నారు. కానీ మాట్లాడనివ్వకుండా తమ గొంతు నొక్కుతున్నారన్నారు.

మధ్యలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు లేచి ఏదో అనబోతుండగా... హరీశ్ రావు స్పందిస్తూ... నువ్వు ఎంత లేచినా నీకు మంత్రి పదవి రాదు లే అన్నా అని చురకలు అంటించారు.

రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రిగా భావిస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. ఇంకా టీపీసీసీ అధ్యక్షుడిగా, ప్రతిపక్షంలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. తమ పార్టీని కుటుంబ పార్టీ అంటున్నారని, కానీ నెహ్రూ నుంచి ఇప్పటి వరకు అది (కాంగ్రెస్) కుటుంబ పార్టీ అన్నారు. పీవీ నరసింహా రావును అవమానించారని ఆరోపించారు. ఈ సమయంలో మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మేం చెప్పేది వినాల్సిందే... పూర్తిగా వినే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచి పోనివ్వం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, తాను కూడా అదే చెబుతున్నానని హరీశ్ అన్నారు. ఎంత సమయం వరకైనా మాట్లాడుకుందాం.. నేను కూడా వారిని పోనివ్వను వ్యాఖ్యానించారు. ఎంతసేపైనా మాట్లాడుదామన్న వారి మాటల్లో నిజాయతీ ఉంటే మా సమాధానం ఓపికగా వినాలన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడింది తాను రాసుకొని మరీ సమాధానం చెబుతున్నానని, మీరు కూడా తాను చెప్పేది రాసుకొని తనకూ సమాధానం ఇవ్వవచ్చునన్నారు.

  • Loading...

More Telugu News