Harish Rao: అసెంబ్లీలో నిరసనకు సిద్ధమైన హరీశ్ రావు... శాసనసభ బుధవారానికి వాయిదా
- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వాడిగా వేడిగా చర్చ
- తనను పదేపదే అడ్డుకోవడంతో నిరసన తెలిపే హక్కు ఉంటుందన్న హరీశ్ రావు
- సభను వాయిదా వేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. తొలి రోజు వేడిగా.. వాడిగా చర్చ సాగింది. గవర్నర్ ప్రసంగానికి శాసన సభ ఆమోదం తెలిపింది. ఈ రోజు సాయంత్రం... తమను మాట్లాడనీయడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు నిరసనకు సిద్ధం కాగా... స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను బుధవారానికి వాయిదా వేశారు.
సభ వాయిదాకు ముందు... హరీశ్ రావు మాట్లాడుతుండగా అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు పలుమార్లు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. హరీశ్ రావు వివరణలకే పరిమితం కావాలని, చర్చను లేవదీసే అంశాలను ప్రస్తావించరాదని స్పీకర్ సూచించారు.
దీంతో, తన గొంతు నొక్కొద్దని... సభలో వాస్తవాలు రికార్డ్ అయ్యేలా చూసే బాధ్యత ఒక సీనియర్ శాసన సభ్యుడిగా తనపై ఉంటుందని హరీశ్ రావు గట్టిగా చెప్పారు. లేదంటే తనకు నిరసన తెలుపడానికి అనుమతి ఇవ్వాలని, నిరసన తెలిపే హక్కు తనకు ఉంటుందన్నారు. ఇంతలో మంత్రి శ్రీధర్ బాబు నిలబడి ప్రతిపక్షాలకు ఇంకేమైనా అభ్యంతరాలు, విభేదాలు ఉన్నా.. ముందు ముందు చర్చించుకోవచ్చని సూచించారు. అనంతరం, స్పీకర్ శాసన సభను వాయిదా వేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం లభించిందని, సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.