mahesh bigala: తెలంగాణ ముఖ్యమంత్రి 'ఎన్నారై' వ్యాఖ్యలపై మహేశ్ బిగాల తీవ్ర ఆగ్రహం
- ఎన్నారైలు అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ అన్న ముఖ్యమంత్రి
- ఇది ఎన్నారైలను అవమానించడమేనన్న మహేశ్ బిగాల
- సీఎం వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించాలని విజ్ఞప్తి
"ఎన్నారై" అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎన్నారై విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎన్నారైలు అంటే 'నాన్ రిలయబుల్ ఇండియన్' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఎన్నారైలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నారై అంటే 'నాన్ రెసిడెంట్ ఇండియన్స్' అని సీఎం సరిదిద్దుకోవాలని హితవు పలికారు. గౌరవసభలో అందరి మర్యాదలు కాపాడేటట్టు ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు భారత ఆర్థిక వ్యవస్థకు చేదోడు వాదోడుగా ఉంటున్నారని గుర్తుంచుకోవాలన్నారు. విదేశీ డబ్బును తమ తమ కుటుంబాలకు పంపడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారన్నారు. సీఎం వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించాలని ఎన్నారైల తరఫున కోరుతున్నట్లు చెప్పారు.