JNTUH: జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు

Grace marks for engineering students under JNTU announced
  • డిప్లొమా పూర్తి చేసినవారికి 23 మార్కులు, ఫైనల్ సెమిస్టర్‌లో ఫెయిలైన విద్యార్థులకు 30 మార్కులు కలపనున్న యూనివర్సిటీ
  • విద్యార్థులు కోరడంతో డీన్‌లతో మాట్లాడి నిర్ణయం తీసుకున్న యూనివర్సిటీ
  • ప్రయోజనం పొందనున్న 4 వేల మంది విద్యార్థులు
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జెఎన్‌టీయూహెచ్) కీలక ప్రకటన చేసింది. యూనివర్సిటీ పరిధిలో 2022-23 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలుపుతున్నట్టు వెల్లడించింది. డిప్లొమా పూర్తిచేసిన ఇంజినీరింగ్‌ విద్యార్థులకు 23 మార్కులు, ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ విద్యార్థులకు 30 మార్కులు కలుపుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా సమయంలో విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు కలిపామని, ఈసారి విద్యార్థులు విజ్ఞప్తి చేయడంతో మార్కులు కలిపినట్టు అధికారులు వివరించారు. ఇంజినీరింగ్‌లోని అన్ని విభాగాల డీన్‌‌లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామని, తక్షణమే నిర్ణయం ఆచరణలోకి వస్తుందని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు. కాగా గ్రేస్ మార్కులు పెంచుతూ యూనివర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ విజయకుమార్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
JNTUH
Engineering student
Grace marks
education
Hyderabad
Telangana

More Telugu News