SBI ATM: గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను తెరిచి.. లక్షల రూపాయలతో ఉడాయించారు!

Thieves break into ATM with gas cutter in Uttarakhand and flee with lakhs in car
  • ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఘటన
  • చోరీలో పాల్గొన్న నలుగురు దుండగులు
  • డబ్బు సంచులతో స్కార్పియో వాహనంలో పరారీ
గ్యాస్ కట్టర్‌తో ఎస్‌బీఐ ఏటీఎంను బద్దలుగొట్టిన నలుగురు దుండగులు లక్షల రూపాయల డబ్బుతో పరారయ్యారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో నిన్న పొద్దుపోయాక జరిగిందీ ఘటన. ధండేరా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో  ప్రకారం.. మొత్తం నలుగురు దొంగలు ఈ చోరీలో  పాలుపంచుకున్నారు. తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఒంటికి దుప్పట్లు చుట్టుకున్న ముగ్గురు దుండగులు ఏటీఎం నుంచి నగదు ఉన్న సంచులతో బయటకు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. బయట ఉన్న పార్క్ చేసిన తెల్లని స్కార్పియో వాహనంలోని డిక్కీలో ఆ డబ్బు సంచులు పడేసి అందరూ కారెక్కి పరారయ్యారు.  

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటీఎంకు చేరుకుని పరిశీలించారు. దొంగల కోసం ఆ ప్రాంతంలో గాలించారు. నిందితులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను కట్ చేయడం వల్ల లోపల ఉన్న నగదు కొంత కాలిపోయినట్టు పోలీసులు తెలిపారు. కాలిపోయిన డబ్బులు వదిలి మిగతా సొత్తుతో వారు పరారైనట్టు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.
SBI ATM
Uttarakhand
Roorkee
Viral Videos
Crime News

More Telugu News