IVF Birth: కొవిడ్‌తో రెండేళ్ల క్రితం భర్త మృతి.. భద్రపరిచిన వీర్యంతో బిడ్డకు జన్మనిచ్చిన భార్య!
- పశ్చిమ బెంగాల్‌లోని భీర్భూమ్‌లో ఘటన
- వివాహమై 27 ఏళ్లు అయినా కలగని సంతానం
- వీర్యం భద్ర పరిచిన రెండేళ్లకే కరోనాతో భర్త మృతి
- ఈ నెల 12న మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
కొవిడ్‌తో మృతి చెందిన భర్త వీర్యంతో ఓ బిడ్డకు జన్మనిచ్చిందో మహిళ. నడివయసులో ప్రసవించినా తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పశ్చిమబెంగాల్‌లోని భీర్భూమ్‌లో జరిగిందీ ఘటన. మురారై ప్రాంతానికి చెందిన సంగీత (48), అరుణ్‌ప్రసాద్‌కు 27 ఏళ్ల క్రితం వివాహమైంది. సంగీతకు గర్భాశయ సమస్యల కారణంగా సంతానం కలగకపోవడంతో ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించారు. రెండేళ్ల క్రితం అరుణ్ ప్రసాద్ వీర్యాన్ని కోల్‌కతాలోని ఓ ల్యాబ్‌లో భద్రపరిచారు.
ఆ తర్వాత కొన్ని రోజులకే అరుణ్ కరోనాతో మృతి చెందాడు. భర్త మరణంతో ఒంటరిగా మారిన సంగీత.. భర్త వీర్యం భద్రంగా ఉండడంతో దాని ద్వారా సంతానం కనాలని నిర్ణయించుకుంది. వైద్యులను సంప్రదించి విషయం చెప్పడంతో ఐవీఎఫ్ పద్ధతిలో ఆమె అండంలోకి భర్త వీర్యాన్ని ప్రవేశపెట్టారు. అలా గర్భం దాల్చిన ఆమె ఈ నెల 12న రాంపూర్‌హాట్ వైద్య కళాశాలలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నడివయసులో బిడ్డకు జన్మనిచ్చినా తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.