Sridhar Babu Duddilla: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే: మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu take a jibe at BJP and BRS

  • సిద్ధిపేటలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
  • విపక్షాలపై ధ్వజమెత్తిన మంత్రి
  • తొమ్మిదేళ్లు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చెట్టాపట్టాలేసుకుని తిరిగారని వ్యాఖ్యలు
  • ఇప్పుడెందుకు బీఆర్ఎస్ పై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ప్రశ్న 

తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విపక్షాలపై ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. వారి మాటలు ఒకలా, చేతలు మరోలా ఉంటాయని విమర్శించారు. బీజేపీ వాళ్లు తొమ్మిదేళ్లు బీఆర్ఎస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. అలాంటిది... బీజేపీ నేతలు ఇప్పుడెందుకు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. 

ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై విచారణ చేపడతామని మేనిఫెస్టోలో పెట్టామని, ఆ మేరకు మాట నిలుపుకుంటామని శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల్లో లోపాలపైనా దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు. 

ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ కు ఓటేశారని, వారు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చూపిస్తామని పేర్కొన్నారు. పలు రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉండేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు తమ వాణిని నిర్భయంగా ప్రభుత్వానికి వినిపించవచ్చని అన్నారు. 

తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలోని ప్రజాహిత కార్యక్రమాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఉద్ఘాటించారు. 

నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేలా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించామని మంత్రి చెప్పారు. త్వరలోనే నిర్దిష్ట కాలావధితో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. సిద్ధిపేటలో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News