Nara Lokesh: యువగళం పాద్రయాత్రలో నారా లోకేశ్ కుడిచేతికి స్వల్పగాయం
- అభివాదం చేస్తున్న సమయంలో లోకేశ్ చేతిని ఓ వ్యక్తి బలంగా నొక్కడంపై స్వల్పంగా వాపు
- పరవాడ మండలంలోకి పాదయాత్ర ప్రవేశించిన సమయంలో చోటుచేసుకున్న ఘటన
- ఎడమ చేతితో అభివాదం, కరచాలనం చేస్తూ ముందుకు సాగిన టీడీపీ యువనేత
‘యువగళం పాద్రయాత్ర’ను కొనసాగిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుడిచేతికి ఆదివారం స్వల్పగాయం అయింది. అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి లోకేశ్ చేతిని అందుకొని బలంగా నొక్కడంతో ఈ గాయమైంది. చీలమండ నరంపై ఒత్తిడి పడడంతో స్వల్పంగా వాపు వచ్చింది. పాదయాత్ర పరవాడ మండలంలోకి ప్రవేశించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయినప్పటికీ లోకేశ్ పాదయాత్రను యథావిధిగా కొనసాగించారు. గాయానికి ఐస్ ముక్కలతో మర్దన చేస్తూ ముందుకు కదిలారు. అయితే అభిమానులతో కరచాలనానికి ఎడమ చేతిని ఉపయోగించారు.
కాగా యువగళం పాదయాత్ర 225వరోజు (ఆదివారం) తోటాడ స్మార్ట్ సిటీ నుంచి మొదలు పెట్టారు. భరణికం గ్రామం వద్ద పాదయాత్ర పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. సిరసపల్లి, వెంకటాపురం, పరవాడ, గొర్లవానిపాలెం, చింతలగొర్లవానిపాలెం, జాజులవానిపాలెం, దేశపాత్రునిపాలెం, స్టీల్ ప్లాంట్ గేటు, సెక్టార్ -10 బస్టాప్, సెక్టార్ – 5 కాంప్లెక్స్ మీదుగా పాదయాత్ర సాగింది. పరవాడ సంతబయలు వద్ద పంచగ్రామాల ప్రజలతో లోకేశ్ సమావేశమయ్యారు. ఎల్‌జీ పాలిమర్స్ బాధితులు, పరవాడ గ్రామ డ్వాక్రా మహిళలు, కాపు సామాజికవర్గీయులు, నిరుద్యోగులు వారి సమస్యలపై లోకేశ్‌కు వినతిపత్రాలు అందించారు. టీడీపీ ప్రభుత్వం మూడు నెలల్లో అధికారంలోకి వస్తుందని, న్యాయమైన వినతులను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.