IT Sector: ఐటీరంగంపై ఆర్థికమాంద్యం ప్రభావం.. వేతనాల్లో కోతలు మళ్లీ షురూ

Recession Hits Infosys and major players announce drastic cuts in pay hikes and promotions

  • ఈ ఏడాది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడిన వేలాదిమంది ఐటీ నిపుణులు
  • అంతా సమసిపోయిందనుకున్న వేళ మళ్లీ ఆందోళన
  • ప్రమోషన్లు నిలిపివేసి, వార్షిక వేతన పెంపును 10 శాతానికే పరిమితం చేస్తున్న సంస్థలు
  • ఆటోమేషన్, ఏఐ ఆక్రమణపై నిపుణుల్లో ఆందోళన

ఐటీ రంగం ఈ ఏడాది తీవ్ర ఒడిదొడుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వేలాదిమంది ఉద్యోగులు కొలువులు కోల్పోయి రోడ్డునపడ్డారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, సేల్స్‌ఫోర్స్, ట్విట్టర్.. ఇలా ఒకటేమిటి అనేక సంస్థలు ఖర్చు తగ్గింపులో భాగంగా వేలాదిమందిని తొలగించాయి. ఇక, పింక్‌స్లిప్‌ల బాధ వదిలిపోయిందనుకుంటున్న వేళ ఐటీరంగంలో మరోమారు కుదుపు కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థికమాంద్యం నేపథ్యంలో బెంగళూరులోని ఐటీ సంస్థలు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఉద్యోగుల వార్షిక వేతన పెంపు, ఉద్యోగులకు ప్రమోషన్లు నిలిపివేయాలని నిర్ణయించాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేసే దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఇచ్చే వార్షిక పెంపును 10 శాతం లోపుకే పరిమితం చేసింది. అమెరికా, యూరప్‌లో ప్రధాన కార్యాలయాలు కలిగి బెంగళూరులో సేవలందిస్తున్న గ్లోబల్ ఐటీ కంపెనీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 

నిజానికి ఉద్యోగాల తొలగింపులు ఈ ఏడాది మొదట్లోనే ప్రారంభమైనప్పటికీ ఆరు నెలల్లో అంతా సమసిపోయి మళ్లీ ఐటీరంగం పట్టాలెక్కుతుందని భావించారు. అయితే, పరిస్థితి మళ్లీ మొదటికే రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, కొత్తగా అడుగుపెట్టిన సంస్థలైతే పెంపు మాటనే పక్కనపెట్టేశాయి. 

సాధారణంగా ఐటీ కంపెనీల్లో వార్షిక పెంపు 20 శాతం వరకు ఉంటుంది. ప్రమోషన్లు పొందిన వారికి ఇది దాదాపు 50 శాతం వరకు ఉంటుంది. అయితే, ఈసారి ప్రమోషన్లను నిలిపివేశారు. ఇప్పటికే ప్రమోషన్లు పొందిన వారికి కూడా 10 నుంచి 20శాతం లోపే పెంపు ఇస్తున్నట్టు తెలిసింది. అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగి ఒకరు తెలిపారు.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 2007, 2009 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగుల స్థానాన్ని ఆక్రమిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ టెక్ కంపెనీ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News