Tirumala: డిసెంబరు 23 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

Vaikunta Dwara Darshans in Tirumala Dec 23 onwards
  • ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు
  • డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు
  • ఈ పది రోజుల పాటు సిఫారసు లేఖలు అంగీకరించబోమన్న ధర్మారెడ్డి
  • టోకెన్ ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని స్పష్టీకరణ 
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుడ్ని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకోవడాన్ని భక్తులు అత్యంత పుణ్యప్రదంగా, అదృష్టంగా భావిస్తారు. కాగా, ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. 

దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి స్పందించారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం తెరిచే ఉంటుందని తెలిపారు. ఈ పది రోజుల్లో భక్తులు ఎప్పుడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నా ఒకే రకమైన పుణ్యం లభిస్తుందని ధర్మారెడ్డి వివరించారు. 

ఇక, వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగే 10 రోజుల పాటు ఎలాంటి సిఫారసు లేఖలు అంగీకరించబోమని, ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వ్యక్తులు దర్శనానికి వస్తేనే సంబంధిత ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. 

ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే 10 రోజులకు సంబంధించి 4.25 లక్షల టోకెన్లను ఈ నెల 22 నుంచి తిరుపతిలో జారీ చేస్తామని చెప్పారు. టోకెన్ కలిగి ఉన్న భక్తులు 24 గంటల ముందుగా మాత్రమే తిరుమల రావాలని, టోకెన్ ఉన్నవారికే వసతి సౌకర్యం, దర్శనం కల్పిస్తామని అన్నారు. తిరుమలలో పరిమిత స్థాయిలో వసతి సౌకర్యాలు ఉన్నందున, భక్తులు తిరుపతిలో కూడా వసతి సౌకర్యం పొందవచ్చని ధర్మారెడ్డి సూచించారు.
Tirumala
Vaikunta Dwara Darshans
EO Dharmareddy
TTD
Tirupati

More Telugu News