Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యూఇయర్ గిఫ్ట్!
- ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- డిసెంబర్ 28 నుంచి మరో రెండు హామీలను అమలు చేయాలనే యోచన
- మహిళలు, వృద్ధులకు ప్రయోజనం చేకూరే హామీల అమలుపై ఆలోచన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు పథకాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు హామీని అమలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు, వృద్ధులకు కొత్త సంవత్సరం బహుమతి ఇవ్వనుంది. మరో రెండు హామీలను అమలులోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, చేయూతలో భాగంగా పెన్షన్ రూ.4 వేలకు పెంపు హామీలను అమలు చేసే యోచనలో ఉంది. ఈ మేరకు గాంధీ భవన్లో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆరు గ్యారెంటీలలో తదుపరి హామీల అమలుపై చర్చించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండు హామీలను డిసెంబర్ 28వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. దీంతో మహిళలు, వృద్ధులకు ప్రయోజనం చేకూరనుంది.