Yuvagalam: రేపటి యువగళం-నవశకం సభకు సర్వం సిద్ధం... తొలిసారిగా ఒకే వేదికపై చంద్రబాబు, పవన్, లోకేశ్

All arrangements completed for Yuvagalam victory meeting

  • ముగిసిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
  • పోలేపల్లి వద్ద భారీ బహిరంగ సభ
  • హాజరవుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సభ

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర పూర్తయిన సందర్భంగా, రేపు (డిసెంబరు 20) భోగాపురం మండలం పోలేపల్లి వద్ద భారీ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. 

ఈ యువగళం-నవశకం బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరుకానున్నారు.

ఈ భారీ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యువగళం-నవశకం సభ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలతో సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకుంటున్నారు. ఇందుకోసం టీడీపీ 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవిగాక ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాల్లో టీడీపీ అభిమానులు సభా స్థలికి చేరుకుంటున్నారు. 

ఈ వేదికపై నుండి ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండటంతో దీనిపై రాష్ట్ర, జాతీయ మీడియా కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పటికే పెద్దఎత్తున మీడియా ప్రతినిధులు విశాఖపట్నానికి చేరుకున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై మాట్లాడటం ఇదే ప్రథమం.

 110 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ జరగనుంది. 8 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. వేదికపై సుమారు 600 మంది ఆసీనులవనున్నారు. సభా వేదిక ఎదురుగా వీఐపీలు కూర్చుంటారు. సభ వీక్షించేందుకు కుర్చీలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

రాష్ట్రం నలుమూలల నుండి సభకు వచ్చే ప్రజలను తరలించడానికి విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చే వాహనాలకు రెండు చోట్ల, విశాఖ వైపు నుండి వచ్చే వాహనాలకు రెండు చోట్ల భారీ పార్కింగ్ లు సభకు ఇరువైపులా ఏర్పాటు చేశారు.  

పోలేపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్లెక్సీలు, స్వాగత తోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది. విశాఖపట్నం-విజయనగరం మధ్య కట్టిన భారీ కటౌట్లు, జెండాలతో ఆ ప్రాంతమంతా పసుపుజాతరను తలపిస్తోంది.

  • Loading...

More Telugu News