Revanth Reddy: 'గృహలక్ష్మి' పథకంపై కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం?
- గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకం
- గృహలక్ష్మి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది
- ఆ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసే యోచన
గృహలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పథకానికి బదులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తిరిగి చేపట్టే అవకాశముంది. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కులం, ఆదాయ సర్టిఫికెట్లతో ఎంతోమంది ఈ పథకం కోసం మీసేవల ముందు వరుస కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి దరఖాస్తులను పరిశీలించవలసిన అవసరం లేదని ఈ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను ఎంచుకుంటామని ఓ మంత్రి కూడా వ్యాఖ్యానించారు.