Nadendla Manohar: ఆ రోజున పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం ఓ సంచలనం: నాదెండ్ల మనోహర్
- పోలిపల్లిలో యువగళం బహిరంగ సభ
- యువగళం నవశకం సభకు హాజరైన నాదెండ్ల మనోహర్
- రాష్ట్రం బాగుండాలనే దిశగా పవన్ అడుగులు వేశారని వెల్లడి
- పవన్ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల వారు హర్షించారని వివరణ
టీడీపీ యువగళం విజయోత్సవ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఈ భారీ సభలో నాదెండ్ల ప్రసంగిస్తూ... రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు పవన్ కల్యాణ్ అని కొనియాడారు. రాష్ట్రం బాగుండాలనే దిశగా పవన్ అడుగులు వేశారని వెల్లడించారు. సెప్టెంబరు 13న రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిశాక పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో ఓ సంచలనం అని నాదెండ్ల అభివర్ణించారు.
ఆ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు హర్షించారని, అన్ని సమస్యలు అధిగమించి ఇంతవరకు వచ్చామని తెలిపారు. జనసేన-టీడీపీ కలయికతో కొత్త శకం ఏర్పడనుందని నాదెండ్ల ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అనేక వేధింపులకు, అవమానాలకు గురయ్యామని... మంచి ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ అవినీతి ప్రభుత్వం ప్రజలకు నిరాశను మిగిల్చిందని, యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని నాదెండ్ల విమర్శించారు.
"టీడీపీ, జనసేన పార్టీలను అణగదొక్కాలని అనేక రకాలుగా వైసీపీ ప్రయత్నించింది. చంద్రబాబు తన అనుభవంతో పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారు. పవన్ కల్యాణ్ రాష్ట్ర భవిష్యత్తుకోసం, రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ముందడుగు వేశారు.
2014లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర భవితవ్యాన్ని వెనక్కి నెట్టారు. రాష్ట్ర యువత జగన్మోహన్ రెడ్డి పాలనతో జరిగిన నష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ఛాన్స్ కు అవకాశం ఇవ్వడం వల్ల ఎంత పొరపాటు జరిగిందో రాష్ట్రమంతా గమనించాలి.
టీడీపీ-జనసేన పార్టీలు సంయుక్తంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రజల ముందుకు తెచ్చాయి. రాష్ట్ర ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు అవసరమైన ఉపాధి, ఉద్యోగావకాశాలు సృష్టించడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో అద్భుతమైన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం" అని నాదెండ్ల పేర్కొన్నారు.