Narendra Modi: తెలంగాణలో నరేంద్రమోదీని చిత్తుగా ఓడించి తెలుగువారి సత్తా చాటుతాను: కేఏ పాల్
- ప్రధాని మోదీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోందన్న కేఏ పాల్
- తెలంగాణలో పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందన్న కేఏ పాల్
- బీజేపీతో కలిసినా జనసేనకు కనీసం డిపాజిట్లు రాలేదని విమర్శ
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారని, అదే నిజమైతే తాను ఆయనపై పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బుధవారం అన్నారు. ప్రధానమంత్రిని ఓడించి తెలుగు వారి సత్తాను చాటుతానన్నారు. తెలంగాణలో తమ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందని, అందుకు ఆసిఫాబాద్ ఓటర్లే నిదర్శమని వ్యాఖ్యానించారు. ఆసిఫాబాద్‌లో రూపాయి ఖర్చు లేకుండానే తమ పార్టీ అభ్యర్థికి 2,500కు పైగా ఓట్లు వచ్చాయన్నారు. బీజేపీతో కలిసి పోటీ చేసినా తెలంగాణలో జనసేనకు కనీసం డిపాజిట్లు దక్కలేదని విమర్శించారు. ఇప్పటికైనా జనసైనికులు తమ అభిప్రాయాలని మార్చుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను మూడు నెలల్లో అమలు చేయాలని సూచించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవదని జోస్యం చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలలోనూ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనలాంటి వారికి పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరారు.