Etela Rajender: లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడంపై ఈటల రాజేందర్ క్లారిటీ
- అధిష్ఠానం ఆదేశాలతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతానన్న మాజీ మంత్రి ఈటల
- కరీంనగర్‌లో కార్యకర్తల సమావేశంలో వెల్లడి
- మెదక్ నుంచి బరిలోకి దిగొచ్చంటూ ప్రచారం
పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాజాగా స్పష్టత నిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశం మేరకు పోటీ చేస్తానని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కష్టంతో కాంగ్రెస్ లబ్ధిపొందిందన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుణ్ణి ఓడించాలని అనేక కుట్రలు చేశారన్నారు. అయితే, అన్నీ గ్రహించి భవిష్యత్తు కోసం పనిచేయాలన్నారు.
ఈటల రాజేందర్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈటల సొంత జిల్లా కరీంనగర్‌కు బండి సంజయ్ ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఈటల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మెదక్ నుంచి ఈటల బరిలోకి దిగే ఆస్కారం ఉందన్న టాక్ వినబడుతోంది. మెదక్ నుంచి కేసీఆర్, విజయశాంతి కూడా బరిలోకి దిగొచ్చన్న వార్తల నేపథ్యంలో మెదక్ సీటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.