Telangana: తెలంగాణలో కొవిడ్ పరిస్థితిపై మంత్రి రాజనరసింహ సమీక్ష
- వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి రాజనరసింహ సమావేశం
- రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై వివరించిన ఉన్నతాధికారులు
- గురువారం ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ మంత్రి ఆదేశం
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. కొవిడ్ పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా, డీహెచ్ రవీంద్రనాయక్, డీఎంఈ త్రివేణి, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు, ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. గురువారం అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రులకు అవసరమైన డీఎస్ఎంఎస్ ఐడీసీ ద్వారా తీసుకోవాలన్నారు. రోగ లక్షణాలు ఉన్న వారికి వెంటనే కొవిడ్ పరీక్షలు చేయాలని, పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను ఉప్పల్‌లోని సీడీసీకి పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిపై వైద్య ఆరోగ్య సిబ్బంది మంత్రికి వివరించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.31 శాతంగా ఉందన్నారు.
అంతకుమునుపు మంత్రి రాజనరసింహ.. కొవిడ్ సన్నద్ధతపై కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల మంత్రులు కూడా పాల్గొన్నారు.