Revanth Reddy: అసెంబ్లీలో అక్బరుద్దీన్ వెర్సస్ రేవంత్ రెడ్డి.. మాటకు మాట!

Revanth Reddy Versus Akbaruddin in Assembly on RSS and ABVP
  • రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుంచి వచ్చి పార్టీలు మారినట్లు పేర్కొన్న అక్బరుద్దీన్
  • నాదెండ్ల నుంచి కిరణ్ రెడ్డి వరకు అందరితో మజ్లిస్ దోస్తీ చేసిందన్న సీఎం రేవంత్ రెడ్డి
  • సభా నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దన్న మల్లు భట్టి
శాసన సభలో విద్యుత్‌పై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. సీఎం రేవంత్ రెడ్డి, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఈ సమయంలో మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు జోక్యం చేసుకొని అక్బరుద్దీన్‌కు సూచనలు చేశారు.

ఓ సందర్భంలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఏబీవీపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, ఆరెస్సెస్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను మజ్లిస్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడుతానన్నారు. నాదెండ్ల.. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, నిన్నటి వరకు కేసీఆర్ ఇలా అందరితో దోస్తీ చేశారని గుర్తు చేశారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో చర్చిద్దామంటే సిద్ధమని, మజ్లిస్ ఎక్కడి నుంచి వచ్చిందో చర్చిద్దాం రండి అన్నారు.

అయితే రేవంత్ గురించి అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు. సభా నాయకుడిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదని అక్బరుద్దీన్‌కు సూచించారు. మీలాగే ఇక్కడివారందరూ గెలిచి వచ్చారని వ్యాఖ్యానించారు. ఎవరి మీద పడితే వారి మీద ఎదురు దాడి చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. సభను తప్పుదారి పట్టించవద్దని అక్బరుద్దీన్‌కు శ్రీధర్ బాబు సూచించారు.
Revanth Reddy
Telangana
Akbaruddin Owaisi
MIM

More Telugu News