Mallu Bhatti Vikramarka: అందుకే శ్వేతపత్రం విడుదల చేశాం: మల్లు భట్టి విక్రమార్క
- విద్యుత్ విషయంలో వాస్తవ పరిస్థితులు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశామన్న మల్లు భట్టి
- సభ్యులు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారన్న ఉప ముఖ్యమంత్రి
- డిస్కంల నష్టాలకు కారణం ఎవరో ప్రజలకు తెలియజేశామని వ్యాఖ్య
వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలనే శ్వేతపత్రం విడుదల చేశామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యుత్ విషయంలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేశామన్నారు. పలువురు సభ్యులు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని మల్లు భట్టి అన్నారు. డిస్కంల నష్టాలకు కారణం ఎవరో సభా సాక్షిగా ప్రజలకు తెలియజేశామన్నారు. అలాగే ఏ ప్రాజెక్టును ఎవరి కాలంలో నిర్మించారో ప్రజలకు చాలా బాగా తెలుసునని చెప్పారు.
విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలు రాత్రికి రాత్రే జరిగేవి కావన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి నాలుగు నుంచి ఏడేళ్ల సమయం పడుతుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునే విద్యుత్ సమస్య పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి పూర్తయ్యాయని, దీంతో విద్యుత్ వచ్చిందన్నారు. అంటే కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విద్యుత్ సంస్థల వల్లే కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్‌ను ఇవ్వగలిగిందన్నారు.