State Election Commission: దివ్యాంగుల వైకల్యాన్ని ప్రతిబింబించే పదాలను రాజకీయ నాయకులు వాడకూడదు: ఎన్నికల సంఘం
- ప్రసంగాల్లో నేతలు వాడే పదాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు
- మూగ, పాగల్, అంధ, గుడ్డి, చెవిటి, కుంటి వంటి పదాలను ఉపయోగించొద్దని స్పష్టత
- ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరిన ఎన్నికల సంఘం
కొందరు రాజకీయ నాయకులు ఈ మధ్య హద్దులు మీరి ప్రసంగిస్తున్నారు. తమ ప్రసంగాల్లో ఆమోదయోగ్యంకాని పదాలు వాడుతున్నారు. ఈ ధోరణిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ నాయకులకు కీలక సూచనలు చేసింది. రాజకీయ నాయకులు, ప్రతినిధులు బహిరంగ ప్రకటన లేదా ప్రసంగాల్లో దివ్యాంగుల వైకల్యాన్ని ప్రతిబింబించే పదాలను వాడకూడదని సూచించింది. మూగ, పాగల్, సిర్ఫిరా, అంధ, గుడ్డి, చెవిటి, కుంటి వంటి పదాలను నేతలు ఉపయోగించకూడదని హెచ్చరించింది. ఇలాంటి పదాలు ఉపయోగించి మాట్లాడడం అవమానకరమైన భాష అవుతుందని, దీని నివారణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల సంఘం కోరింది.
నాయకుల ఉపన్యాసాలు, ప్రకటనలు, సోషల్ మీడియా పోస్ట్‌లు సహా అన్ని విధాల ప్రచారాల్లో దివ్యాంగుల పట్ల వివక్ష ప్రతిబింబించే పదాలు వాడొద్దని రాజకీయ పార్టీలను కోరింది. దీనిని అధిగమించేందుకు పార్టీలు అంతర్గతంగా సమీక్షించుకోవాలని సూచించింది. రాజకీయ ప్రసంగాల్లో ఇలాంటి పదాలను నిషేధించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు తమ నాయకులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఈసీ కోరింది. రాజకీయ నాయకులు తమ రచనలు, కథనాలు, ప్రచారం సహా ఎక్కడా అభ్యంతరకర పదాలు వాడొద్దని స్పష్టత నిచ్చింది. దివ్యాంగుల వైకల్యాన్ని ప్రతిబింబించే పదాలు అభ్యంతరకరమైనవి, సమాజంలో పక్షపాతాలను శాశ్వతం చేస్తున్నాయని వివరించింది.