BRS: మీడియా పాయింట్ వద్ద మాట్లాడవద్దంటున్నారు... అసలు ఈ కొత్త రూల్ ఎవరు తీసుకు వచ్చారు?: బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్
- అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న ఎమ్మెల్యే వివేకానంద
- మీడియా పాయింట్ వద్దా మాట్లాడవద్దంటున్నారని విమర్శ
- ఎందుకు మాట్లాడనీయడం లేదో అసెంబ్లీ సిబ్బంది సమాధానం చెప్పాలని నిలదీత
- మీడియా పాయింట్ వద్ద ఎప్పుడూ ఇలాంటి ఆంక్షలు లేవని ఆవేదన
అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని... బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్దా మాట్లాడితే వద్దంటున్నారని... అసలు ఈ కొత్త రూల్ ఎవరు తీసుకు వచ్చారు? అసెంబ్లీ సిబ్బంది దీనికి సమాధానం చెప్పాలని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ... మీడియా పాయింట్ వద్ద ఎప్పుడూ ఇలాంటి ఆంక్షలు లేవన్నారు. మా నాయకుడి గెలుపును అవమానించేలా సభలో మాట్లాడటం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాకి తగినట్లుగా మాట్లాడటం లేదని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు తనను వరుసగా మూడుసార్లు గెలిపించారని... ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానించే విధంగా ఈ రోజు సభలో అధికార పార్టీ మాట్లాడిందని విమర్శలు గుప్పించారు. మజ్లిస్ పార్టీతో కుమ్మక్కుయ్యామనడం సరికాదన్నారు. కాగా, జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్, నిజామాబాద్ అర్బన్‌లో షబ్బీర్ అలీని ఓడించేందుకు బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి ప్రయత్నాలు చేశాయని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు.