South Central Railway: సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలు ఇవే!

South Central Railway announced 20 special trains for Sankranti festival
  • సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి గుడ్‌న్యూస్
  • తిరుపతి - హైదరాబాద్‌, కాచిగూడ -కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు
  • ప్రయాణించనున్న తేదీలు, స్టేషన్ల వివరాలు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని ద‌ృష్టిలో ఉంచుకొని 20 స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 26 మధ్య కాచిగూడ-కాకినాడ టౌన్‌, హైదరాబాద్ -తిరుపతి రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు వెల్లడించింది. స్లీపర్‌, జనరల్‌ బోగీలతోపాటు ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో నడపనున్న ఈ రైళ్ల వివరాలను తెలిపింది.

డిసెంబర్‌ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో తిరుపతి - హైదరాబాద్‌ రైలు (07510) ప్రయాణిస్తుంది. శుక్రవారం రాత్రి 8.15 గంటల ప్రయాణం మొదలై శనివారం ఉదయం 8.40 గంటలకు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతుంది. ఇక డిసెంబర్‌ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో హైదరాబాద్‌ - తిరుపతి రైలు (07509) సర్వీసు నడుస్తుంది. గురువారం రాత్రి 7.25 గంటలకు బయల్దేరి శుక్రవారం ఉదయం 8.20 గంటలకల్లా గమ్యస్థానం చేరుతుంది. కాగా హైదరాబాద్‌ -తిరుపతి- హైదరాబాద్‌ స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.

డిసెంబర్‌ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో (గురువారాలు) కాచిగూడ - కాకినాడ టౌన్‌ రైలు (07653) రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుతుంది. ఇక కాకినాడ టౌన్‌- కాచిగూడ రైలు (07654) డిసెంబర్‌ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 5.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. కాచిగూడ-కాకినాడ టౌన్‌, కాకినాడ టౌన్-కాచిగూడ స్పెషల్ రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి.
South Central Railway
Indian Railways
Railway Service
Sankranti festival
Special Trains
Andhra Pradesh
Telangana

More Telugu News