Soumya Swaminathan: జేఎన్1 వేరియంట్ ను తక్కువగా అంచనా వేయొద్దంటున్న డబ్ల్యూహెచ్ఓ మాజీ చీఫ్ సైంటిస్ట్

WHO former chief scientist Soumya Swaminathan warns people not take lightly on JN1 variant
  • భారత్ లో మళ్లీ కరోనా కలకలం
  • కొత్త వేరియంట్ ను జేఎన్1 గా గుర్తించిన కేంద్రం
  • నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు
  • ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
భారత్ లో జేఎన్1 కరోనా వేరియంట్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య నాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేఎన్1 వేరియంట్ ను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు. దీన్ని సాధారణ జలుబు కింద కొట్టిపారేయలేమని, ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ, సౌమ్య స్వామినాథన్ 5 అంశాలను ప్రస్తావించారు. 

1. సాధారణ జలుబుతో పోల్చి చూస్తే ఇది చాలా ప్రత్యేకమైన వేరియంట్. ప్రజలు దీని వల్ల న్యుమోనియాతో తీవ్ర అనారోగ్యానికి గురికావడమే కాదు, దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యల బారినపడతారు. 
2. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ తో బాధపడిన వారి సమాచారం ఇప్పుడు మన వద్ద ఉంది. గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు, స్ట్రోక్ బాధితులు, మధుమేహం, మతిమరుపు, మానసిక కుంగుబాటు, మానసిక సమస్యలు, దీర్ఘకాలిక అలసట, కండరాల నొప్పులతో బాధపడేవారు ఒక్కసారి కొవిడ్ బారినపడితే తిరిగి మామూలు ఆరోగ్యాన్ని సంతరించుకోవడం వారి శక్తికి మించిన పని అవుతుంది. 
3. అందుకే కొవిడ్ పట్ల ఏ మాత్రం ఉదాసీనతకు చోటివ్వకూడదు. ఇప్పటికీ ఆ వైరస్ మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే భయాందోళనలకు గురవ్వాల్సిన అవసరం లేదు. 
4. ఇప్పుడు వ్యాపిస్తున్న కొత్త వేరియంట్ ను ఎదుర్కోవడానికి మనకందరికీ తెలిసిన ముందు జాగ్రత్త చర్యలు సరిపోతాయి. జేఎన్1 కూడా ఒమిక్రాన్ కుటుంబానికి చెందినదే. ఒమిక్రాన్ ఒకట్రెండు ఉత్పరివర్తనాలకు లోనై జేఎన్1 ఏర్పడి ఉంటుంది. అందుకే దీనిపై ఓ కన్నేసి ఉంచాలని డబ్ల్యూహెచ్ఓ కూడా చెబుతోంది. 
5. గాలి సరిగా ప్రసరించని గదుల్లో ఉండరాదు. ముఖ్యంగా, మాస్క్ లేకుండా ఉన్న వ్యక్తులతో కలిసి ఎక్కువ సమయం గడపొద్దు. ఇతరులతో కలిసి ఓ గదిలో ఉండాల్సినప్పుడు మాస్క్ ధరించాలి.
Soumya Swaminathan
JN1
COVID19
Variant
India
WHO

More Telugu News