TSRTC: ఉచిత ప్రయాణ సౌకర్యం నేపథ్యంలో మహిళలకు టీఎస్ఆర్టీసీ కీలక విజ్ఞప్తి

TSRTC key appeal to women passengers give priority to Palle Velugu busses for short distence
  • తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని సూచన
  • దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడి
  • వీడియో ద్వారా మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేసిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్
మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న టీఎస్‌ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు 'పల్లె వెలుగు' బస్సులు ఎక్కాలని కోరింది. తక్కువ దూరం ప్రయాణించేవారు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కుతున్నట్టుగా యాజమాన్యం దృష్టికి వచ్చిందని, పర్యవసానంగా ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలంటూ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని, ఇకపై ఎక్స్‌ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లో మాత్రమే ఆపుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోందని ఆయన వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోందని, సహకరిస్తున్న సిబ్బందికి, ప్రయాణికులకు.. అందరికీ ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. 
TSRTC
Palle Velugu busses
Free Journey to Ladies
TSRTC MD Sajjanar
Telangana

More Telugu News