Mukkoti Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

Lord Vishunu giving darshan to devotees from Uttaradwaram
  • ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివార్లను దర్శించుకుంటున్న భక్తులు
  • తెల్లవారుజాము నుంచే కిక్కిరిసిపోయిన ఆలయాలు
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
  • భక్తులతో కోలాహలంగా యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, ధర్మపురి
నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశిగా పిలిచే ఈ రోజున ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహావిష్ణువును పూజిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. అంతేకాదు, ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం.

ఈ తెల్లవారుజామున 1.45 గంటలకే వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్ఎల్ భట్టి, జస్టిస్ శ్యాంసుందర్, జస్టిస్ తారాలా రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ ‌చంద్ గెహ్లాట్, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, ఉష, శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లుబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామకృష్ణరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు వంటి ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు.

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విష్ణుమూర్తి రూపంలో భక్తులకు ఉత్తర రాజగోపురం వద్ద దర్శనమిచ్చారు. ఇక్కడ జరుగుతున్న వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే, భద్రాద్రి రామయ్య, వేములవాడ రాజన్న ఆలయాల్లోనూ భక్తులకు స్వామివార్లు ఉత్తర ద్వారం దర్శనమిస్తున్నారు.
Mukkoti Ekadasi
Vaikunta Dwara Darshanam
Tirumala
Vemulawada
Dharmapuri
Yadadri
Bhadradri

More Telugu News