Lift Crash: 8వ అంతస్తు నుంచి కింద పడిన లిఫ్ట్.. ఐసీయూలో ఐదుగురు ఉద్యోగులు

Lift Crashes From 8th Floor In Noida Building 5 Techies In ICU

  • నోయిడాలోని ఓ ఐటీ కంపెనీ ఆఫీసులో ఘటన
  • విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఉద్యోగులకు గాయాలు
  • ప్రమాద సమయంలో లిఫ్ట్ లో మొత్తం 9 మంది ఉన్నారన్న పోలీసులు

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఉన్న ఓ ఆఫీసు బిల్డింగ్ లో లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ లోని లిఫ్ట్ 8వ అంతస్తు నుంచి ఒక్కసారిగా కింద పడింది. దీంతో అందులో ఉన్న తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 125 లో రివర్ సైడ్ టవర్ బిల్డింగ్ లో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ బిల్డింగ్ లోని 8వ ఫ్లోర్ లో ఎరాస్మిత్ టెక్నాలజీస్ అనే ఐటీ కంపెనీ ఉంది.

అందులో పనిచేస్తున్న 9 మంది ఉద్యోగులు ఆఫీసులో డ్యూటీ ముగించుకుని కిందికి దిగేందుకు లిఫ్ట్ లోకి ఎక్కారు. అయితే, 8వ అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కింద పడింది. దీంతో కొందరికి కాళ్లు విరగగా మరికొందరికి చేతులు విరిగాయని, ఇంకొందరికి ఇతరత్రా గాయాలయ్యాయని పోలీసులు వివరించారు. అందరినీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం తొమ్మిది మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News