Sam Curran: ఇంగ్లండ్ క్రికెటర్ శామ్ కరన్ గొప్ప ఆటగాడు అంటూనే సంచలన వ్యాఖ్యలు చేసిన డివిలియర్స్
- కరన్ తీసుకున్న మొత్తానికి, ప్రదర్శనకు సంబంధం లేదన్న డివిలియర్స్
- అతడిపై పంజాబ్ కింగ్స్ ఎక్కువ మొత్తం పెట్టేసిందన్న సౌతాఫ్రికా దిగ్గజం
- అలా అని అతడేమీ అనామక ఆటగాడు కాదన్న డివిలియర్స్
- కరన్‌ను వేలానికి వదిలేయాల్సి ఉండేదన్న ఏబీడీ
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ మంచి ఆటగాడు అంటూనే అతనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్. ఇంగ్లండ్ జట్టు కోసం కానీ, ఐపీఎల్లో కానీ కరన్ ఎప్పుడూ అనుకున్నంత స్థాయిలో ఆడలేదని విమర్శించాడు. ఇటీవల జరిగిన మినీ వేలానికి సంబంధించి డివిలియర్స్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2023 వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18.50 కోట్లకు కొనుగోలు చేయడం శుద్ధ దండగని పేర్కొన్నాడు. ఆ వేలంలో అత్యధిక ధర పలికింది అతడికే. ఇప్పుడూ అదే జట్టుతో ఉన్నాడు.
తాజా వేలంలో కంగారూ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లు, పాట్ కమిన్స్ రూ. 20.5 కోట్లకు అమ్ముడు కావడంపై స్పందిస్తూ కరన్ గురించి ప్రస్తావించాడు. కరన్‌కు అంతమొత్తం చెల్లించినా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడని గుర్తు చేశాడు. అయితే, విషయాన్ని తాను వివాదం చేయాలనుకోవడం లేదని, కాకపోతే అతడు తీసుకున్న మొత్తం కంటే అతడి ప్రదర్శన తక్కువగా ఉందని వ్యాఖ్యానించాడు.
అలాగని అతడేమీ తక్కువ స్థాయి ఆటగాడు కాదని పేర్కొన్నాడు. కరన్ ఆటను తాను కూడా ఇష్టపడతానని, కాకపోతే ఇటీవలి కాలంలో అతడు అనుకున్న స్థాయిలో రాణించడం లేదని చెప్పుకొచ్చాడు. అయితే, తనదైన రోజున మాత్రం చెలరేగిపోతాడని పేర్కొన్నాడు. కరన్‌ను వేలానికి పంపించి ఉంటే అతడి స్థానంలో విభిన్నమైన ఆటగాళ్లు పంజాబ్‌కు దొరికి ఉండేవారని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.