Lalu Prasad Yadav: విమానంలో లాలు ప్రసాద్‌తో కేంద్రమంత్రి చర్చలు.. బీహార్ రాజకీయాల్లో కలకలం
- ఢిల్లీ నుంచి పాట్నా విమానంలో లాలు, గిరిరాజ్ సింగ్ చర్చలు
- బీహార్ భవిష్యత్తు తన కుమారుడి నాయకత్వంపై ఆధారపడి ఉందని లాలు చెప్పారన్న గిరిరాజ్
- అలా ఏమీ లేదన్న తేజస్వీ యాదవ్
ఆర్జీడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ విమానంలో చర్చలు జరపడం బీహార్ రాజకీయాల్లో కుదుపునకు కారణమయ్యాయి. ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లే రొటీన్ ఫ్లైట్‌లో వీరిద్దరూ మాట్లాడుకున్నారు. తామిద్దరం విమానంలో మాట్లాడుకున్నట్టు గిరిరాజ్‌సింగ్ నిర్ధారించారు. బీహార్ భవిష్యత్తు తన కుమారుడు తేజస్వీ యాదవ్ నాయకత్వంపై ఆధారపడి ఉందని తాను నమ్ముతున్నట్టు లాలు ప్రసాద్ యాదవ్ తనతో చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ వాదనను తేజస్వీ ఖండించారు.
‘ఇండియా’ కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన తర్వాత కూటమిలో అంతర్గత విభేదాలు పొడసూపినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు బేకార్ (పనికిమాలినవి) అని కొట్టిపడేశారు. బీజేపీ నేత, తన తండ్రి కలిసి తన భవిష్యత్తు సహా అన్ని విషయాలు మాట్లాడుకున్నట్టు చెప్పారు. గిరిరాజ్ సింగ్ తన తండ్రి ఆరోగ్యం గురించి ఆరా తీశారని, మాంసాహార విందు ఇచ్చేందుకు ఆసక్తి కనబరిచారని పేర్కొన్నారు. అదే విమానంలో తేజస్వీ కూడా ఉన్నారు. గిరిరాజ్ సింగ్, లాలుప్రసాద్ విమానం చర్చలపై బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కూడా స్పందించారు. ఇండియా కూటమి పరిస్థితి బాగాలేదని పేర్కొన్నారు.